online marketing

Sunday, April 22, 2012

సిండికేట్లు వర్ధిల్లాలని అధికార కాంగ్రెసు పార్టీ విజయనగరంలో ధర్నా చేస్తోందా అని మాజీ మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు: మద్యం సిండికేట్లు వర్ధిల్లాలని అధికార కాంగ్రెసు పార్టీ విజయనగరంలో ధర్నా చేస్తోందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.

మద్యం సిండికేట్లపై తెలుగుదేశం పార్టీ మాట్లాడితే బొత్సకు ఉలుకెందుకని ఆయన ప్రశ్నించారు. బొత్స తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఇతర నేతలపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే సహించేది లేదన్నారు. సిండికేట్లపై ఎసిబి విచారణ వద్దన్న బొత్సకు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. అధికార పార్టీ అయి ఉండి కాంగ్రెసు ధర్నాలు, ఆందోళనలకు దిగడం సిగ్గు చేటు అన్నారు.

మద్యం సిండికేట్లకు మద్దతు పలుకుతున్న బొత్స సత్యనారాయణ అందుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల పైన కాకుండా బొత్స పెంచిన మద్యం ధరలు తగ్గించాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తే బాగుంటుందని సూచించారు.

అంతకుముందు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కూడా కాంగ్రెసుపై విరుచుకు పడ్డారు. విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశంకు ఎక్కడైనా ధర్నాలు నిర్వహించే స్వేచ్ఛ, ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఉందని చెప్పారు. విజయనగర సభకు అనుమతి అడిగామని, అయితే అనుమతి ఇవ్వకున్నా నిర్వహించి తీరుతామన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడం ఎస్పీ చేతకాని తనానికి నిదర్శనమన్నారు.

కాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాంగ్రెసు పార్టీ దుర్వినియోగం చేస్తోందని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ దళితులను మోసం చేస్తోందని, దళితుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను ఉప ఎన్నికలలో గెలుపు కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh