online marketing

Monday, March 19, 2012

నేడు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ..కోవూరు ఓట్ల లెక్కింపు రేపు


కోవూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనే సిబ్బందికి మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 19 రౌండ్లలో పూర్తిస్థాయి ఫలితం వెల్లడవుతుంది. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాట్లు చేశారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 8.30 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపును బుచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి ప్రారంభించి కోవూరు, కొడవలూరు, విడవలూరు, చివరగా ఇందుకూరుపేట మండలంతో పూర్తవుతుంది. తొలి రౌండ్ ఫలితానికి అర్ధ గంట సమయం పట్టవచ్చు. ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన తుది ఫలితం అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఓట్లు నమోదైన ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి బి. శ్రీధర్, రిటర్నింగ్ అధికారి వీరభద్రయ్య తదితరులు పరిశీలించారు.  కోవూరు ఉప ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి మంగళవారం కోవూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరభద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 255 పోలింగ్ బూత్‌లకు సంబంధించి 19 రౌండ్లకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారుల చొప్పున 42 మందిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. వీరందరికీ సహకారం అందించేందుకు మరో 100 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని, లెక్కింపు సందర్భంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక కమాండో దళాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. అందుకోసం నాలుగు ప్రత్యేక గదుల్లో సీసీ కెమెరాలు అమర్చామన్నారు. టేబుళ్ల వద్ద చిన్నపొరపాటు దొర్లినా సీసీ కెమెరా ద్వారా ఉన్నతాధికారులకు తెలుస్తుందన్నారు. లెక్కింపు సమయంలో అధికారులంతా సమయపాలన పాటించి విధులకు హాజరుకావాలన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh