online marketing

Friday, March 16, 2012

21 రోజుల ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం 5 గంటలతో ముగిసింది

ఒరేయ్‌...నిద్ర లేరా... అబ్బాయ్‌, ఉండయ్యా అలసిపోయాను... ఒరేయ్‌ లేటైతే డబ్బులు పోతాయ్‌రా... నా మాట విని త్వరగా లెయ్‌రా... (ఇది తండ్రీ కొడుకుల సంభాషణ). ఏమయ్యా... ఈ రోజు పని లేదా? నీకేమైంది.. రెండు రోజుల నుంచి మందంగా ఉన్నావ్‌... అబ్బా విసుగు పెట్టబాకే..కూలీ నాలి లేదు...చేతిలో చిల్లిగవ్వ లేదు... ఇల్లు గడవడమెట్లా... అని ఆలోచిస్తున్నాను. (ఇది భార్యభర్తల సంభాషణ). ఒరే ఫ్రండ్‌... పోలింగ్‌ డే దగ్గర పడుతుందిరా... ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటున్నవారికి ఒక్కో పార్టీవారు ఒక్కో రేటు ఇస్తున్నట్లు తెలిసిందిరా... త్వరగా బయలుదేరుదాం పదా.. లేటైతే నగదు మిస్సే. (ఇవి నిరుద్యోగ యువకుల మాటలు). ఈ మాటలన్నీ వివిధ వర్గాల ప్రజల్లో ఎందుకొచ్చాయనుకుంటున్నారా? ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారన్న ప్రధాన ఉద్దేశ్యమే కారణం. ఇక ఎన్నికల ప్రచారం ఎలా ముగిసిందో చూద్దాం.

21 రోజుల ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం 5 గంటలతో ముగిసింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు వారి వారి గెలుపు కోసం పట్టు సాధించే ఉద్దేశ్యంతో రెండు పర్యాయాలు రాష్ట్ర నాయకులను ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్‌ షోలలో నిలిపారు. ఈ ప్రచారాల్లో ఒకరిపై మరొకరు మాటల తూటాలతో విమర్శనాస్త్రాలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. గెలుపుపై ఎవరి ధీమా వారికుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోని 5 మండలాలైన ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. రాజుపాళెంలో జరిగిన సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గెలుపుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావులు రాజుపాళెంలో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకు కూడా నియోజకవర్గంలోని ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలంరెడ్డి ప్రచారంలో ఆనం బ్రదర్స్‌ అయిన రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని రోడ్‌షోలు నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కోవూరులో వారం రోజులపాటు బస చేసి రోడ్‌షోలలో పాల్గొని ప్రచారాలు నిర్వహించారు. ఆయన సభలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీనినిబట్టి చూస్తుంటే ప్రజలు తెలివిగా వ్యవహరిస్తూ మూడు పార్టీల అభ్యర్థుల ప్రచారాలకు వెళ్లినట్లు తెలియవచ్చింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారిదే అయినప్పటికీ లోలోన కొంత ఆవేదనకు గురవుతున్నట్లు తెలిసింది. దీనికి ప్రధాన కారణం ఓటరు నాడి అంతు చిక్కకుండా ఉండడమే. ప్రతి ఓటుకు ఒక్కోపార్టీ ఒక్కో రేటు రూ.200, రూ.500, రూ.1000లు చొప్పున పంపిణీ చేస్తుండడం కూడా రాజకీయ విశ్లేషకుల చర్చనీయాంశంగా మారింది.

కొంతమంది పేదలైతే కూలీ నాలి లేక కడుపు మాడ్చుకుంటూ గడుపుతున్న వారు రాజకీయ నాయకులు ఓటుకు ఇచ్చేడబ్బులు కొంత ఊరటనిస్తందనే మాటలు వినిపిస్తున్నాయి. మరికొందారు ఇలాంటి ఓట్లు మళ్లీ మళ్లీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు విన వచ్చింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తు.చ పాటిస్తున్నామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. చేతల వరకు ఉండడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక భద్రత విషయానికొస్తే ఒక్కోచోట పోలీసులు నామ్‌కే వాస్తి తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 108, ఆర్టీసి బస్సులు, మరికొన్ని వాహనాలు కూడా యథేచ్ఛగా వదిలేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాకుండా టు వీలర్స్‌ వారిని ఆపుతూ తనిఖీలు చేపడుతూ లైసెన్సులు లేనివారిపై కొరడా ఝళిపిస్తూ అంతో ఇంతో వారి నుంచి ఆమ్యామ్యాలు స్వీకరించి వదిలేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కోడూరుపాడులో ఆర్థికమంత్రి రామనారాయణరెడ్డి కాన్వాయ్‌ను పోలీస్‌ అధికారులు యథేచ్ఛగా వదిలివేయడంతో వారిపై వేటు పడిన సందర్భమే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి మరింకెన్నో. రాష్ట్రంలోనే కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక ఫలితాల కోసం నాయకులు, ప్రజలు 21వ తేదీ వరకు వేచి చూడాల్సిందే

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh