online marketing

Sunday, August 28, 2011

ప్రజా నాయకుడు జగన్‌

నెల్లూరు : రాష్ట్రంలో ప్రజానాయకుడు వైఎస్‌ఆర్‌ మరణంతో ఆ లోటును తీర్చగల నాయకుడు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగల సమర్థుడు వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డేనని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌కు భయపడి కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను ఆపేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చూపడం బాధ కలిగించిందని, మనస్తాపం చెందానని అందుకే ఎంపి పదవికి రాజీనామా చేశానన్నారు. వైఎస్‌ఆర్‌ మరణంతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయి ప్రజలు ఆ మహానేతను తలచుకుంటూ అల్లాడిపోతున్నారన్నారు. భజనపరుల మాట వినే కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ను దూరం చేసుకుందని ఆయన కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శ చేశారు.


ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి సోదరులు శనివారం నగరానికి విచ్చేసిన సందర్భంగా వారికి పార్టీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఆ పార్టీ కార్యకర్తలు అయ్యప్పగుడి వద్ద నుండి గాంధీబొమ్మ వరకు భారీగా స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారికంటే జగన్‌ ఎంతో అనుభవఙ్ఞుడైన ప్రజానాయకుడని ఆయన కొనియాడారు.


జగన్‌కు వస్తున్న ఆదరణ చూచి కాంగ్రెస్‌పార్టీ ఈ చర్యకు పూనుకుందన్నారు. వైఎస్‌ఆర్‌ లేని లోటు తీర్చగల వ్యక్తి జగనే అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్‌ లక్షణాలు ఎవరికీ లేవని, అందుకే రాష్ట్ర ప్రజలు జగన్‌ను సమర్థిస్తున్నారన్నారు. అందుకు నిదర్శనమే కడప, పులివెందుల ఎన్నికలు అని అన్నారు. కడపలో వచ్చిన మెజారిటీని చూచి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. జగన్‌ ఆదరణకు తట్టుకోలేకనే హైకోర్టు చెప్పకపోయినా వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఆర్‌లో ఇరికించారని, తండ్రి కొడుకులు నేరాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్ళి ఇచ్చిన మాట కోసం ఓదార్పు చేయడమే జగన్‌ చేసిన నేరమా? అని ప్రశ్నించారు.


ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మహా నేత వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌ను దోషులుగా చూపడంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం చూపించారని, రైతులకు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, మహిళలకు పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పక్కా గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారని, ఇవన్నీ వైఎస్‌ఆర్‌ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే వైఎస్‌ఆర్‌ చేసిన తప్పా? అని రెండు పర్యాయాలు కాంగ్రెస్‌పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాసిన మహానేతకు గుర్తింపుగా కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొలిపి కేసులు పెట్టించి ప్రజల హృదయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఛీకొట్టించుకుంటుందన్నారు.


రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి జగనేనన్నారు. మీరు కోరుకున్నట్లుగా రాజీనామాలు చేశామని, దమ్ముంటే రాజీనామాలు చేసి మాతో పోటీకి సిద్ధ పడాలని పరోక్షంగా ఆనం సోదరులకు సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ బొమ్మతోనే ప్రజల వద్దకు వెళ్తాం. ఏ బొమ్మతో మీరు ప్రజల వద్దకు వెళ్తారు? మిమ్ములను ప్రజలు నమ్ముతారా... ఆ రోజులు పోయాయని ఆయన వ్యంగ్యంగా చమత్కరించారు.


రాజకీయ వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న వ్యక్తి జగనే
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరకపోవడంతో ఆ విషయాలను, రాజకీయ వాస్తవాలుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. నెల్లూరు ప్రజలు తెలివైన వారని, మహానేత వైఎస్‌ఆర్‌ నమ్మకాన్ని, ఆయన చూపిన ఆదరణను మరచిపోలేక, ఆయనపై వచ్చిన మచ్చను తట్టుకోలేక ఎంపి, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు.


అంతకుముందు కన్వీనర్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ వెంట నడవాలని, వైఎస్‌ఆర్‌పై వచ్చిన మచ్చలను తుడిచివేయాలని, ఎంపి, ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌ పార్టీ నేతలు త్యాగం చేసి రాజీనామాలు చేశారన్నారు. రెండున్నర సంవత్సరాల సమయమున్నా పదవులను త్యజించిన త్యాగమూర్తులన్నారు. ఆనాడు దేవుడు- నేడు దోషి, అదే కాంగ్రెస్‌ నీచ బుద్ధికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. దొంగతనం చేసిన దొంగ తప్పించుకునేందుకు దొంగ... దొంగ... అని అరుస్తారని, అందుకే చంద్రబాబు జగన్‌ను, వైఎస్‌ఆర్‌ను దొంగలుగా చెబుతూ ముందుగానే దొంగ దొంగ అని అరుస్తున్నారన్నారు.


ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పంచెకట్టు వైఎస్‌ఆర్‌కే అంకితమని, నీకు పంచెకట్టు అంతగా పనికిరాదని, దమ్ముండబట్టే మా నాయకులు రాజీనామాలు చేశారు. ధైర్యముంటే మీరూ రాజీనామాలు చేసి పోటీకి సిద్ధం కండి అని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి పద్మనాభరెడ్డి, యల్లసిరి గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూర్యప్రకాష్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు ప్రసంగించగా స్థానిక నేతలు నగళ్ల కిరణ్‌కుమార్‌, బిసి చెన్నారెడ్డి, కలికి శ్రీధర్‌రెడ్డి, బాల చెన్నయ్య, పాపకన్ను శేఖర్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh