online marketing

Wednesday, May 4, 2011

రగడ.... రగడే

నెల్లూరు: ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా తయారైంది జిల్లాలోని పలువురు అధికారుల పరిస్థితి. గతంలో ఆనం సోదరులు, మేకపాటి సోదరులు సఖ్యతగా ఉన్న రోజుల్లో వారి సిఫార్సులు, అండదండలతో జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో కీలక పోస్టులలోకి చేరుకున్న పలువురు ఉద్యోగులకు నేడు బదిలీల జ్వరం పట్టుకుంది. అయితే ఆనం సోదరుల ఆశీస్సులతో అధికారులుగా కొనసాగుతున్న వారికి ఎలాంటి ఢోకా లేకపోయినప్పటికీ సమస్యల్లా మేకపాటి సోదరుల అధికారులుగా గుర్తింపు పొందిన వారిదే. గత కొంత కాలంగా ఉప్పులో నిప్పుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆనం సోదరులు, మేకపాటి సోదరుల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.

ఒకరిపై ఒకరు ఘాటైన పదజాలాలతో విమర్శించుకుంటుండడం మామూలైపోయింది. అయితే ఈ విమర్శలు కేవలం జిల్లా స్థాయికే కాకుండా రాష్టస్థ్రాయికి పాకుతోంది. ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ గెలుపోటములు ఈ సోదరులిద్దరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు జగన్‌, వైఎస్‌.విజయలక్ష్మిల గెలుపు కోసం వైఎస్‌ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మేకపాటి సోదరులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి తదితర నేతలు గత 20 రోజులుగా కడప జిల్లాలోనే తిష్ట వేసి ముమ్మరంగా ప్రచారం కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.

ఎన్నికలు మరో 5 రోజుల్లో జరుగనుండడంతో ఈ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. జిల్లాలో మొదలైన ఈ వర్గపోరు ప్రస్తుతం కడప జిల్లాకు చేరుకుంది. అక్కడ సైతం ఆనం, మేకపాటి సోదరులు ఒకరిపై ఒకరు ఘాటుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా సోమవారం కడప జిల్లాలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆనం సోదరులకు విసిరిన సవాల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, వై.ఎస్‌. విజయలక్ష్మిలు ఓడిపోతే తాను, తన సోదరుడు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేస్తామని, అదే కాంగ్రెస్‌ అభ్యర్థులు డిఎల్‌.రవీంద్రరెడ్డి, వైఎస్‌.వివేకానందరెడ్డిలు ఓడిపోతే ఆనం సోదరులు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య రోజు రోజుకీ అగాధం పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదని జిల్లాకు చెందిన రాజకీయ పెద్దలు చెబుతున్నారు.

కడప జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములు ఏవిధంగా ఉన్నా జిల్లాలో కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి అధికారుల బదిలీలు మాత్రం తప్పేలా లేవు. అయితే ఈ బదిలీలకు ‘సాధారణ’ బదిలీలు అని పేరు పెడుతున్నప్పటికీ ఇవి మాత్రం ముమ్మాటికీ రాజకీయ బదిలీలేనని చెప్పక తప్పదు. గత మూడేళ్లుగా ఐటిడిఎ పిఒగా జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రమేష్‌ ప్రజాప్రతినిధులు అందరితోనూ సఖ్యతగానే మెలుగుతున్నప్పటికీ మేకపాటి సోదరులు, ముఖ్యంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో మరింత సఖ్యతగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ఇడిగా, రాజీవ్‌ విద్యామిషన్‌ పిఒగా పనిచేసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో డ్వామా పిడిగా పని చేస్తున్న యుగంధర్‌కుమార్‌ కన్ను ఐటిడిఎ పిఒ కుర్చీ పడినట్లు తెలిసింది.

అందుకు ఆయనకు జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభించడంతో రాజధాని స్థాయిలో అన్ని విధాలా ‘ఏర్పాట్లు’ పూర్తి చేసుకుని ఇక రేపో మాపో ఆ కుర్చీలో కూర్చునే తరుణంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త, గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ పనబాక కృష్ణయ్య అడ్డు తగిలినట్లు సమాచారం. ప్రస్తుతం పిఒగా ఉన్న రమేష్‌ను బదిలీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే ఆ స్థానంలో యుగంధర్‌ కుమార్‌ నియామకంపై ఆయన గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో జిల్లా మంత్రి సైతం ఒక అడుగు వెనుకేసినట్లు తెలిసింది.

పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకున్న యుగంధర్‌కుమార్‌ తాజాగా ఖాళీ అయిన డ్వామా పిడి స్థానంలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతోపాటు మరో మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పించుకోవ డంతో పాటు జిల్లాలో బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ బదిలీల ప్రభావం జిల్లా పోలీస్‌ యంత్రాంగంలో కూడా తీవ్రంగానే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నగర డిఎస్‌పిగా ఉన్న జిఆర్‌.రాధిక కరీంనగర్‌కు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతోపాటు జిల్లాలోని పలువురు డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐల బదిలీలు కూడా జరుగనున్నట్లు సమాచారం.

జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కె.రాంగోపాల్‌ బదిలీ అయిన నేపథ్యంలో ఎస్‌పి ఇ.దామోదర్‌కు కూడా త్వరలో స్థాన భ్రంశం కానున్నట్లు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనప్పటికీ ఎస్‌పి దామోదర్‌ స్వయంగా తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. దీంతో త్వరలో జిల్లాకు కొత్త ఎస్‌పి రానున్నారని, వారు కూడా ఆనం సోదరుల ఆశీస్సులు ఉన్నవారే వస్తున్నట్లు పోలీస్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh