online marketing

Monday, January 25, 2010

ఐక్యంగా సాగుదాం...సమైక్యంగా ఉందాం


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: రాజకీయాలకు, భావసారూపత్యలకు అతీతంగా అందరూ ఐక్యంగా కలిసి పోరాడడం ద్వారా సమైక్యాంధ్రను సజీవంగా నిలపాలంటూ అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రామ్మూర్తినగర్‌లోని బాలపీరయ్య కల్యాణమండపంలో జరిగిన సీమాంధ్రనేతల సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, విద్యావంతులు, మేధావులు పాల్గొని ప్రసంగించారు. జెఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ శామ్యూల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖపట్నం ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు పన్నిన కుట్రగా తెలంగాణా ఉద్యమాన్ని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలో 143 మంది ఎమ్మెల్యేలు రాజీనామలు చేశారంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బూటకపు మాటలతో తెలంగాణా ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారనీ, దీన్ని అందరూ గుర్తించాలని కోరారు. కోస్తాంధ్రతో పోల్చితే తెలంగాణా వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో ఎంతో ముందున్న సంగతిని ఇటీవలి సర్వేలు వెల్లడించాయన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణాను అడ్డం పెట్టుకొని కెసీఆర్‌ కుటుంబం బ్రతుకుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌ ఒక దుష్టశక్తని అన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రులపై కొందరు తెలంగాణా నేతలు ఇష్టారీతిగా నోరుపారేసుకుంటున్నారనీ, దీన్ని అందరూ ఖండించాలని కోరారు. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతాలకూ, వ్యాపారాలకూ ముడిపెట్టడం సరికాదని తెలంగాణావాదులకు హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్రిక్తల నడుమ విడిపోతే చివరకు ఇండియా, పాకిస్తాన్‌ల మాదిరిగా విరోధులుగా ఉండిపోతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలను సాకుగా చూపి కొందరు నేతలు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అటువంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఆలస్యం కావడమే ప్రస్తుత అనిశ్చితి కారణమనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. జెఏసీ గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్‌ నరసింహారావు మాట్లాడుతూ ఆంధ్రుల పెట్టుబడులతో పెరిగి అభివృద్ధి సాధించిన హైదరాబాద్‌ను వదులుకునేందుకు ఏ ఆంధ్రుడూ సిద్ధంగా లేడన్నారు. ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్టమ్రంతా ఒకే జెఏసీని ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాష్టవ్య్రాప్తం చేయాలని సూచించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమంకార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన తెలుగుతల్లి కార్యక్రమం అందరినీ అలరించింది. కలిసి ఉన్న తెలుగుతమ్ముళ్లను కెసీఆర్‌ విడదీయాలని భావిస్తున్న తీరును విద్యార్థులు కళ్లకు కట్టిన ట్లు చూపించి ఆహుతుల మన్ననలను అందుకున్నారు. అనంతరం అన్ని పార్టీల నేతలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బల్లి దుర్గాప్రసాద్‌, పరసారత్నం, కాంగ్రెస్‌ నేతలు ఎల్లసరి గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, చాట్ల నరసింహారావు, టీడీపీ నేతలు కిలారి వెంకటస్వామినాయుడు, టి.రమేష్‌రెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్‌, టివి కృష్ణయాదవ్‌, ఇతర సంఘాలకు చెందిన కెవి చలమయ్య, ఆచార్య ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh