online marketing

Monday, December 28, 2009

కొంత మోదం...కొంత ఖేదం

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: ఈ ఏడాది జిల్లా రైతు ఆశించినంతగా వికసించలేకపోయాడని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉదాసీనత, మధ్య మధ్యలో ప్రకృతి ప్రకోపం కలగలిసి రైతుకు మిశ్రమ ఫలితాలను మాత్రమే మిగిల్చాయి. ప్రతి ఏడాది ఏదో రకంగా ప్రకృతి వైపరీత్యాలకు ఎంతో కొంత నష్టపోతున్న జిల్లా రైతు ఈ ఏడాదైనా ప్రకృతి కరుణిస్తుందని ఆశించాడు. అన్నదాతల ఆశలను ప్రకృతి ఈ ఏడాది పూర్తిగా వమ్ము చేయకపోయినా జూన్‌, జూలై, ఆగష్టు నెలల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కలవరపెట్టాయి. గత ఏడాది ఖరీప్‌ సాగు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తయి, జిల్లా వ్యాప్తంగా సుమారు 11.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దిగుబడి బాగుందని అన్నదాత భావించే లోపే దళారుల పుణ్యమాని గిట్టుబాటు ధర లేక అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ కష్టానికి తగిన గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతూ అన్నదాతలు జిల్లాలో మార్చి నెలలో ఆందోళన చేపట్టారు. మే నెలలో వ చ్చిన ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పంట తోటలు దెబ్బతిన్నాయి. మామిడి, బత్తాయి, నిమ్మ పంటలకు తీవ్ర నష్టం కలిగింది. గాలుల ప్రభావం వలన పండ్లన్నీ నేలరాలిపోవడంతో తలపై చేతులు పెట్టుకొని దిగాలుగా రైతులు ఉండిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన నిస్సహాయతను మరోసారి చూపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఆక్వాసాగు మరింత తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది రబీలో డెల్టా కింద 2 లక్షలా 30వేల ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు మార్చి నెలలో జరిగిన ఐఏబి సమావేశంలో నిర్ణయించారు. అధికారులు అనుకున్న విధంగానే ఈ ఆయకట్టు మొత్తానికి నీటిని అందించడంలో సఫలీకృతులైనారు. అయితే నాయుడుపేట, బోగోలు తదితర మండలాలతో పాటు మెట్ట ప్రాంత మండలాల్లో నీరు లేక వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. చివరకు పశువుల దాణాగా పొలాలను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యుత్‌ కోత వలనే ఇటువంటి పరిస్థితి దాపురించిందనీ, తమకు నష్టపరిహారం అందచేయాలని రైతులు చేసిన విజ్ఙప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇక ఖరీప్‌ సాగుకు సమాయత్తమవుతున్న జిల్లా రైతుపై ప్రకృతి ప్రకోపాన్ని చూపించిన సంఘటన జూన్‌, జూలై, ఆగష్టు నెలల్లో చోటుచేసుకొంది. రైతుల నుంచి వస్తున్న ఆందోళనలతో జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దిగొచ్చిన ప్రభుత్వం జిల్లాలోని రాపూరు, నెల్లూరురూరల్‌ మండలాల మినహా మిగతా మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ రెండు ప్రాంతాల రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో చివరకు ఆ రెండు మండలాలను కూడా కరవు జాబితాలో చేర్చారు. కరవు జాబితాలో అన్ని ప్రాంతాలను చేర్చడంతో తమ పనైపోయినట్లు ప్రభుత్వం భావించడం బాధాకరం. ఇంతవరకూ రైతులకు ఎటువంటి కరవు ప్రోత్సాహకాలు అందలేదు. రుణాలను రీషెడ్యూల్‌ చేస్తారని భావించిన అన్నదాతను ప్రభుత్వం కనికరించలేదు. మెట్టప్రాంతాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల వలన పాడిరైతు కూడా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పశుగ్రాస కొరతతో పశువులను అయిష్టంగా కబేళాలకు పాడిరైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. చీకటి వెంటే వెలుతురున్నట్లు, కరవు కోరల్లో చిక్కిన రైతన్నను ప్రభుత్వం మరచినా అదే ప్రకృతి తిరిగి ఆదుకుంది. సెప్టెంబర్‌ నెల నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల పుణ్యమాని జిల్లాలోని అన్ని జలాశయాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో జిల్లాలో ఖరీప్‌ సాగుకు సుమారు నాలుగు లక్షలా 10వేల ఎకరాల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. తుపాన్‌ల నెలగా పేరుగాంచిన నవంబర్‌ నెలలో ఎటువంటి ప్రకృతి ఉపద్రవం చోటుచేసుకోకపోవడంతో అన్నదాత ఊపిరి పీల్చుకున్నాడు. మరో పక్షం రోజుల్లో ఖరీప్‌ కోతలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జలయజ్ఙంలో భాగంగా చేపట్టిన బ్యారేజి నిర్మాణాలు, చెరువుల మరమ్మతులు, కాలువల ఆధునీకరణ తదితర బృహత్తర కార్యక్రమాలన్నీ తాబేలు నడక చందాన కొనసాగుతుండడం రైతులకు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని సడలించేలా చే స్తోంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh