online marketing

Friday, December 25, 2009

కొత్తపట్నం ‘సెజ్‌’లో అవినీతి బాగోతం

కోట, (మేజర్‌న్యూస్‌) : కోట చిల్లకూరు మండలాల్లో ప్రత్యేక ఆర్ధిక మండళ్లు (సెజ్‌)కు సేకరించిన భూమికి పరిహారంలో బినామీల పేర్లతో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారిస్తున్న అధికారులను స్థానిక అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారులు, భూ స్వాములు కొందరు సాగించిన దుశ్చర్యలు వెలుగు చూస్తున్నా ఏమీ జరగలేదంటూ బుకాయిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి.అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం కొత్తపట్నం, తూర్పు కనుపూరు సెజ్‌ల్లో చోటు చేసుకున్న అవతకవకలపై దర్యాప్తు చేస్తుండగా కొందరు అక్రమార్కులు అవకతవకలు బయట రానీయకుండా ఉండేందుకు రాజీ యత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిసింది. సెజ్‌ల కోసం సుమారు 6 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే కొత్తపట్నం, కర్లపూడి, సిద్దవరం, తూర్పుకనుపూరు, వేళ్లపాళెం పరిధిలో సిజెఎఫ్‌ఎస్‌ భూములకు కూడా పరిహారం పంపిణీ చేసి ఉన్నారు. ఈ పంపిణీ చేసిన పరిహారంలో దాదాపు 5 కోట్ల రూపాయల మేర బినామి పేర్లతో అధికారులు, భూ స్వాములు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని పరిహారం చెల్లించిన దాదాపు 300 ఎకరాల్లో అసలైన పట్టాదారులు లేకపోవడంతో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మకై్క భాగాలు పంచుకున్నట్లు తెలిసింది. పట్టాదారులు లేకుండా తమ రెవెన్యూ లోని భూములకు సంబంధించిన పరిహారాన్ని పరులు పంచుకునే ప్రయత్నాలపై స్థానికులు తిరగబడ్డంతో అధికారులే దగ్గరుండి మధ్యస్తాలు జరిపి పంపకాలు నిర్ణయించడం విశేషం. సెజ్‌ కోసం సేకరించిన భూమికి ఎకరాకు 1 లక్షా 90 వేల రూపాయల పరిహారంలో గ్రామానికి 30 వేల రూపాయలు మాత్రం మిగిలింది. మిగిలిన మొత్తాన్ని అధికారులు, రాజకీయ నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొత్తపట్నం గ్రామానికి చెందిన రేషన్‌ షాపు డీలర్‌ వెంకటాద్రి, అధికారులు, స్థానిక నాయకులు తమ ఖాతాల్లో జమ చేసుకుని తరువాత గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. బినామీల చెల్లింపు విషయంలో బ్యాంకర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. యమదిన్నెపాళెం, గున్నంపడియ, పోసినవారిపాళెం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 595, 596, 597లలోని 19.62 ఎకరాలకు చెందిన పరిహారం దాదాపు 37 లక్షల రూపాయలు చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు స్వాహా చేశాడని తెలిసింది. 1963 ప్రాంతంలో అసైన్‌మెంట్‌ భూములను గిరిజనులైన గడ్డం పోలయ్య, గడ్డం రామయ్య, మానికల పోలయ్య, చింతపూడి సుబ్బయ్యలు పట్టాలు కలిగి ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా ఊర్లో లేకపోవడంతో బల్లవోలు గ్రామానికి చెందిన కొందరు గిరిజనులకు బ్యాంకులో వలలకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుండి సంతకాలు సేకరించి ఖాతాలు తెరిచారు. అనంతరం ఆ గిరిజన లబ్ధ్దిదారులు వీరే అని బ్యాంక్‌ అధికారులకు చూపి డబ్బులు డ్రా చేసి ఒక గిరిజనుడికి 1900 రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే చిల్లకూరు మండలం వేళ్లపాళెం గ్రామంలో మల్లిగుంట చిన్నయ్యకు చెందిన 260/1, 2, 262/1, 275/2 సర్వే నెంబర్ల లోని 4.53 ఎకరాల భూమికి పరిహారంగా 8 లక్షలా 60 వేల 760 రూపాయలు చెక్కు చిన్నయ్య పేరున రాగా సదరు వ్యక్తి దీర్ఘకాలంగా గ్రామంలో లేకపోవడంతో వారసులు కూడా అక్కడ లేకపోవడంతో బినామి వ్యక్తిని సృష్టించి ఆ పరిహారం మొత్తాన్ని బల్లవోలు రాజకీయ నాయకులు స్వాహా చేశారని తెలిసింది. పాలు గంగయ్య అనే వ్యక్తికి సర్వే నెంబరు 268/4లో 1.24 ఎకరాలు, 268/2లో 63 సెంట్లు 263/1లో 50 సెంట్లు భూమికి గాను దాదాపు 3 లక్షలా 80 వేల రూపాయలకు సంబంధించిన పరిహారం మొత్తాన్ని కూడా స్వాహా చేసినట్లు తెలిసింది. ఇలా ఎన్నో రకాలుగా అవకతవకలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా అధికారుల దృష్టికే ఈ అవకతవకలు వచ్చినా కూడా వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కాలం వెళ్లదీస్తుండడంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు నిజాయితీ కలిగిన అధికారులచేత సమగ్ర విచారణ జరిపిస్తే అసలు దోషులు బయటపడతారని స్థానికులు కోరుతున్నారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh