online marketing

Friday, December 11, 2009

జెఇ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: చిన్నారులకు మెదడువాపు వ్యాధిని రానీయకుండా చేసే జెఇ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వ్యాక్సినేటర్లు (ఎఎన్‌ఎంలు) అత్యంత శ్రద్ధ వహించి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి జిల్లాలో తొలివిడతగా నెల్లూరు, గూడూరు డివిజన్లలో (గ్రామీణ ప్రాంతాలు) జెఇ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించబోవు సందర్భంగా సంబంధిత వ్యాక్సినేటర్లకు స్థానిక టౌన్‌హాల్‌లో బుధవారం మధ్యాహ్నం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్‌ వెంకటరమణారెడ్డి వైద్యాధికారులు, వ్యాక్సినేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు జరిపి విజయవంతం చేయాలని సూచించారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడినవారిలో 70 శాతం మంది పిల్లలు చనిపోవడంగాని, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడతారని చెప్పారు. అందువల్ల ముందుగానే వ్యాధిని దరి చేరనీయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా సంబంధిత వ్యాక్సిన్‌ను భ ద్రపరచే విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. ఇటీవల కొన్నిచోట్ల పలు కారణాల వల్ల వ్యాక్సిన్‌ కొంత మేరకు దెబ్బ తిన్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్నారు.

వ్యాక్సినేటర్లు, వైద్యాధికారులు ఆయా ప్రాంతాల అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, టీచర్ల సహకారం తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆయా మండలాల విద్యాశాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం తీసుకోవాలన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకచోట జెఇ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టర్లను అంటించాలని, వ్యాధి నివారణ పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకుగాను విస్తృతంగా కరపత్రాలను పంచి పెట్టాలన్నారు. ముఖ్యంగా జ్వరం, టిబి, హెచ్‌ఐబి తదితర వ్యాధులు ఉన్నవారిని ముందుగా గుర్తించి అలాంటి వారికి ఈ వ్యాక్సిన్‌ను వేయాల్సిన అవసరం లేదని సూచించారు.
ప్రజల ఆరోగ్యంతో ఆడుకోబోము జెఇ వ్యాక్సిన్‌ వేయగానే కొందరికి సాధారణంగా జ్వరం వస్తుందని దానిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించే విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడడంతోపాటు వారి ఆరోగ్యంతో ఆటలాడబోమని డాక్టర్‌ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ వెంకటాద్రి మాట్లాడుతూ 1 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు టీకాలు (జెఇ వ్యాక్సినేషన్‌) వేసే విషయంలో వ్యాక్సినేటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఉంటే వ్యాక్సిన్‌ వికటించే ప్రమాదముందని హెచ్చరించారు. పిహెచ్‌సిల నుంచి వ్యాక్సిన్‌ను తీసుకెళ్లేటప్పటి నుంచి చిన్నారులకు వ్యాక్సిన్‌ వేసేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వారికి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ దశరధరామయ్య, క్షయ నివారణాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్‌ సివి.రమాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, జిల్లాలోని పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh